‘వైశాఖం’ మ‌రో బెస్ట్ మూవీ అవుతుంది!

జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీ పి.ఆర్‌.వోగా, నిర్మాతగా, సూపర్‌హిట్‌ పత్రికాధినేతగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్‌ చేసుకున్న బి.ఎ.రాజు పుట్టినరోజు జనవరి 7. తన పుట్టినరోజు సందర్భంగా ఇండ‌స్ట్రీ హిట్ వెబ్ సైట్ తెలుగు వెర్ష‌న్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో …..
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”నేను సీనియర్‌ జర్నలిస్ట్‌ మోహన్‌కుమార్‌గారి సహకారంతో జర్నలిస్ట్‌గా మారాను. జర్నలిస్ట్‌గా మోహన్‌కుమార్‌గారే నాకు గురువు. అయితే నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం సూపర్‌స్టార్‌ కృష్ణగారే. ఆంధ్రభూమి, శివరంజని సహా పలు పత్రికల్లో 12 ఏళ్ళ పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన తర్వాత సూపర్‌హిట్‌ అనే సినిమా మేగజైన్‌ను స్టార్ట్‌ చేశాను. సూపర్‌హిట్‌ స్టార్ట్‌ చేసి 24 సంవత్సరాలవుతుంది. అలాగే నిర్మాతగా కూడా పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. వచ్చే ఏడాదికి సూపర్‌హిట్‌ 25 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నాం. ఇన్ని ఏళ్లుగా పనిచేస్తున్న నాకు రెండు, మూడేళ్ళే అవుతున్నట్లుగా ఉంటుంది. అందుకు కారణం నేను చేసిన పనిని చాలా ఇష్టంతో చేయడమే అందుకు కారణం. ప్రతిరోజూ పనిచేయడమే నా పాలసీ. ఇంకా ఎనర్జీతో పనిచేయాలనుకుంటూ ఉంటాను. అలాగే పి.ఆర్‌.ఓగా అందరి స్టార్స్‌ సినిమాలకు పనిచేశాను. నిర్మాతగా మారిన తర్వాత సినిమాలోని కథకు న్యాయం చేస్తూ కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. అయితే డైరెక్షన్‌ మాత్రం చేయను. ఎందుకంటే డైరెక్షన్‌ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నిర్మాతగా వైశాఖం సినిమాను నిర్మించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైశాఖం విడుదల కంటే ముందుగానే మరో సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరగుతున్నాయి. నా బ్యానర్‌లో వచ్చిన చిత్రాలన్నింటిలో వైశాఖం బెస్ట్‌ మూవీ అవుతుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. నా సక్సెస్‌ కారణం నా సతీమణి, డైరెక్టర్‌ బి.జయగారే కారణం. నా జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.