తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టండి: బాలకృష్ణ

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మహాకూటమి తరపున హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై బాలకృష్ణ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. టీడీపీలో గెలిచి..కన్నతల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా తలసాని శ్రీనివాస్ పార్టీ మారారని మండిపడ్డారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టాలన్నారు.

ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ వెంటే ఉన్న మహాకూటమి అభ్యర్థి వెంకటేశ్‌గౌడ్‌ను గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుకి మూడొస్తే.. ఫాంహౌస్‌కి వెళ్లి పడుకునే వ్యక్తి కాదని, నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు. బాహుబలి సినిమాలో రాజు భళ్లాలదేవుడైనా.. ప్రజలు బాహుబలిని గుర్తు పెట్టుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం మొన్నటివరకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చిందని బాలకృష్ణ విమర్శించారు.