తెరపైకి కొత్త టైటిల్.. బాలయ్య కోసమే!

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సినిమాల విషయంలో పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా చేస్తోన్న బాలయ్య దీని తరువాత 102వ సినిమా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే ఈ సినిమాకు నిన్నమొన్నటివరకు ‘రెడ్డిగారు’,’జయసింహా’ ఇలా రెండు టైటిల్స్ వినిపించాయి. ఈ రెండింటిలో ఏదొకటి ఫైనల్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఇది బాలయ్య 102వ సినిమా కోసమేనని ప్రచారం జరుగుతోంది. 
నిజానికి గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలోని బాలయ్య సినిమా కోసం ఈ టైటిల్ ను పరిశీలించారు. కానీ ఫైనల్ గా దానికి మరో టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడు మిస్ అయింది కానీ ఇప్పుడు వర్కవుట్ అవుతుందంటూ అభిమానులు సంతోషపడుతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా నయనతార అలానే ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నట్లు సమాచారం. ‘పైసా వసూల్’ పూర్తయిన వెంటనే రవికుమార్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు బాలయ్య.