మహిళలపై భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. దీనిపై ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్‌ నటుడు కే భాగ్యరాజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడు చూసినా ఫోన్లలోనే ఉంటున్నారని, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారని.. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం అని అన్నారు. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని అన్నారు.