Homeతెలుగు Newsఏపీకి ఊపిరి: మేఘా క్రయోజనిక్ ట్యాంకుల విరాళం

ఏపీకి ఊపిరి: మేఘా క్రయోజనిక్ ట్యాంకుల విరాళం

  • సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి
  • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు
  • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత
  • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
  • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం
  • దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ ట్యాంకులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం మూడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్. ఒక్కోటి 1. 40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యం ఉన్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్ లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజెనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపిన తరువాత అవి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరతాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్టానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ఉచితంగా థాయిలాండ్ నుంచి దిగుమతు చేసుకుని అందించిన విషయం తెలిసిందే. రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి కావడానికి కృషి చేశాయన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4. 20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. మన రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది.

Megha oxygen cryogenic tanks to Andhra Pradesh

కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది.

బొల్లారంలో గల ఎంఈఐఎల్ ప్లాంట్ లో ఆక్సిజన్ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇది పూర్తిగా కోవిడ్ రోగుల చికిత్సా అవసరాలకోసం అందిస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ సామర్థ్యం 7000 లీటర్లు కాగా రోజుకు సరాసరిన కనీసం 17 ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. రోజుకు సరాసరిన 400 సిలిండర్లను ఎంఈఐఎల్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు అంటే మే 9 నుంచి మే 31 వరకు 56014 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందుకోసం ఎంఈఐఎల్ ప్రత్యేకంగా ఒక బందాన్ని ఏర్పాటు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu