‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి నుండి మరో సినిమా..

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా ద్వారా తెలుగు తెరకి వెంకటేష్‌ మహా దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాస్తవానికి చాలా దగ్గరగా ఆయన అల్లుకున్న కథ .. సహజత్వంతో కూడిన పాత్రలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. అప్పటి నుంచి వెంకటేష్ మహా నుంచి రానున్న తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఒక మలయాళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఆ మలయాళ సినిమా పేరే ‘మహేషింటే ప్రతీకారం. దిలీష్‌ పోతన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి వసూళ్లతో పాటు జాతీయ అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి వెంకటేష్‌ మహా రీమేక్ చేస్తున్నాడు. సత్యదేవ్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, వచ్చేనెలలో షూటింగును పూర్తిచేసుకోనుంది.