రానాను ప్రశంసించిన మహేష్‌

గతకొద్ది రోజులుగా సినీ ఇండ‌స్ట్రీలో ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ గురించి చ‌ర్చ భారీగానే జ‌రుగుతోంది. క‌థ ప‌రంగా చిన్నదే అయినా.. మలిచిన తీరు అద్భతమంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు ఇప్పటికే చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా వీరి జాబితాలో చేరాడు. ఈ సినిమాను చూసిన ఆయన.. యూనిట్‌ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.

‘కేరాఫ్‌ కంచరపాలెం ప్రత్యేక చిత్రం. ఇది నిజంగానే దర్శకుడి సినిమా. అద్భుతంగా రచించిన పాత్రలతో సాగే ప్రయాణం. క్లైమాక్స్‌ ఈ సినిమాకు గుండెకాయ వంటిది. తొలి సినిమానే అత్యద్భుతంగా తెరకెక్కించిన వెంకటేష్‌ మహాకు శుభాకాంక్షలు. సినిమా చాలా నచ్చింది’ అని ట్వీట్‌ చేశారు మహేష్‌.

ఈ సినిమాను ‘సమర్పించిన’ దగ్గుబాటి రానాను మహేష్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘వెంకటేష్‌ మహా వంటి ప్రతిభావంతును ప్రోత్సహిస్తున్నందుకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రానాకు కితాబునిచ్చారు.