HomeTelugu Big Storiesకోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం

7 21ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్‌మీడియాలో ట్వీట్లు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, రానా, మంచు లక్ష్మి తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.

మహేశ్‌బాబు: దర్శకుడు కోడి రామకృష్ణ గారు కన్నుమూశారని తెలిసి ఎంతో బాధపడ్డా. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ అనిర్వచనీయం. ఆయన పనిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.

మంచు లక్ష్మి: మీ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ‘అరుంధతి’, ‘అమ్మోరు’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘అంకుశం’ వంటి గొప్ప చిత్రాల్ని మనకిచ్చారు. ఇలాంటి కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు శక్తిని ఇవ్వాలి.

ఎన్టీఆర్‌: తెలుగు చిత్ర పరిశ్రమ ఓ లెజెండ్‌ను కోల్పోయింది. కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మేం మిమ్మల్ని మిస్‌ అయ్యాం.

బి.గోపాల్‌: కోడి రామకృష్ణ మృతి చాలా బాధాకరం. ఆయన చాలా మంచి మనిషి.. గొప్ప‌ దర్శకుడు‌. ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవారు. మంచి మిత్రుడు, దర్శకుడ్ని కోల్పోయా. 100 సినిమాలు పూర్తి చేసిన డైరెక్టర్‌ అంటే సామాన్యమైన విషయం కాదు. ‘ముద్దుల మావయ్య’, ‘మంగమ్మగారి మనవడు’, ‘ఇంటిదొంగ’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీశారు. ఎప్పుడు అందర్నీ నవ్విస్తూ ఉండేవారు.

కల్యాణ్‌రామ్: కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మీ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

నాని: ఆ జనరేషన్‌లో ఎంతో శాంతంగా ఉండే వ్యక్తి ఆయన. హెడ్‌ బ్యాండ్‌ ఇవాళ తన స్టైల్‌ను కోల్పోయింది. మనం లెజెండ్‌ను కోల్పోయాం. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం.

రానా: కోడి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.

పరుచూరి గోపాలకృష్ణ: వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, ఎందరో నటీనటులకు సినీ జీవితాన్ని అందించి, తెలుగు చలన చిత్ర చరిత్ర పుస్తకంలో తనకూ ఒక పేజీని కేటాయించుకుని, గురువు దాసరి గారిని కలవడానికి వెళ్లిపోయిన కోడి రామకృష్ణకు ఘన నివాళి. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

సాయిధరమ్‌ తేజ్‌: మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా సర్‌.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

మారుతి: లెజెండరీ దర్శకుడ్ని కోల్పోయాం.

వెన్నెల కిశోర్: ఈ వార్త షాక్‌కు గురి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుడు.. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాం సర్‌.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌: ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాం.

శ్రీదేవి మూవీస్‌ సంస్థ: లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.

అలీ: కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ పరిచయం‌ చేసింది కోడి రామకృష్ణ గారే. ‘అమ్మోరు’ సినిమాలో ఆయన గ్రాఫిక్స్‌ను చూపించిన విధానం అద్భుతం. ఒక క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేయాలంటే కోడి రామకృష్ణ గారి తర్వాతే ఎవరైనా. కోడి రామకృష్ణ దగ్గర ఒక సినిమా చేస్తే ఎంతో పేరు వస్తుందని చాలా మంది ఇప్పటికే చెప్పారు. ‘అంకుశం’లో రామిరెడ్డి గారికి, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌ .. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులకు ఆయన జీవితం‌ ఇచ్చారు. దాదాపు 40 సినిమాల్లో ఆయన దర్శకత్వంలో పనిచేశాను. ఇటీవల ఓ ఫంక్షన్‌లో కనిపించి ‘ఈటీవీ’లో నువ్వు చేస్తున్న ప్రోగ్రామ్‌ బాగుంది, నేనూ రావాలి అన్నారు. కానీ, ఆ అదృష్టం మాకు దక్కలేదు. గొప్ప దర్శకుడు మన మధ్య లేరని చెప్పటానికి చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. ఇప్పుడున్న దర్శకులకు కోడిరామకృష్ణ గారు ఆదర్శం.

మురళీ మోహన్‌: దాసరి నారాయణరావు దగ్గర కోడి రామకృష్ణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అనేక చిత్రాల్లో కలిసి పనిచేశాం. ప్రొడ్యూసర్‌ డైరెక్టర్‌ ఆయన. టైమ్‌ ప్రకారం పనిచేసే వారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ఆ రంగాన్ని మర్చిపోకుండా లలిత కళా నాట్యమండలి ద్వార నాటక పోటీలు నిర్వహించేవారు. ఎప్పుడూ సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వారు. మంచి హుషారుగా ఉండేవారు. ప్రతి నిర్మాత, ఆర్టిస్టు ఆయన డైరెక్షన్‌లో పనిచేయటానికి ఇష్టపడేవారు. ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేశారు. నాటక రంగం నుంచి ఒక రచయితగా, దర్శకుడిగా రావడం వల్ల ఏ సన్నివేశాన్ని అయినా అలవోకగా చేయించే వారు. ఏదైనా సన్నివేశంలో మాటల రచయిత సరిగా రాయకపోతే వెంటనే ఆయన రాసి షూటింగ్‌ పూర్తి చేసేవారు. కోడి రామకృష్ణ మృతి వార్త చాలా బాధనిపించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu