ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ


వ్యవసాయాధార దేశమైన భారత్‌కు రైతే వెన్నెముక. పల్లెలే పట్టు కొమ్మలు. ఇక్కడ అత్యధికమంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వాల కోపాలు, ప్రకృతి ప్రకోపాలు అన్నీ రైతుపైనే. గత కొంతకాలంగా వ్యవసాయదారుల్లో ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి ఉన్న మాట కాదలేని వాస్తవం. సార్వత్రిక సమరానికి సమయం సమీపిస్తున్న వేళ రైతులను ప్రసన్నం చేసుకోవడం మోడీ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. బహుశా అందుకే శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు పెద్ద పీట వేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓట్ల ఏరువాకకు తెరతీశారు.

రైతులకు మేలు చేసేలా బడ్జెట్‌ ఉండబోతోందన్న ఆర్థిక రంగ నిపుణులకు గోయల్‌ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. పెట్టుబడి సాయం నేరుగా రైతులకు అందించే పథకం ప్రవేశపెడితే బాగుంటుందని మోడీ సర్కారు గత కొంతకాలంగా తీవ్ర కసరత్తులు చేసింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను సైతం పరిశీలించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ రైతుకూ ప్రతీ పంటకూ ఎకరాకు రూ.4000 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా “రైతు బంధు” పథకాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలంటే ఎదురయ్యే లాభనష్టాలను సైతం బేరీజు వేసింది. ఇదే రీతిలో ఒడిశా సర్కారు అమలు చేస్తున్న కలియా (కృషక్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ఆగ్మెంటేషన్‌) స్కీంను కూడా పరిశీలించింది. దీని కింద ఒక రైతు కుటుంబానికి వార్షికంగా రూ 10,000 చొప్పున జమ చేస్తారు. ఎంత పొలం..? ఎవరెవరు హక్కుదారులు.. అన్న అంశాల జోలికి పోకుండా రైతు పేరిట జమ అయిపోతుంది. కొద్దిపాటి పొలం ఉన్న వారికీ, కౌలుదార్లకీ కూడా వర్తించేట్లుగా దీన్ని రూపొందించారు. వీటన్నింటినీ రంగరించి తాజా బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి” పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. డిసెంబర్‌ 2018 నుంచే అమల్లోకి వచ్చినట్లు గోయల్‌ చెప్పారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా పశుపోషణ, మత్స్యపరిశ్రమ రైతులు జరిపే లావాదేవీలపై 2 శాతం వడ్డీ రాయితీని గోయల్‌ ప్రకటించారు. అదే విధంగా ఆయా రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే, అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ కూడా లభించనుంది. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలపైనా ఆర్థిక మంత్రి కరుణ చూపారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆందోళనల కారణంగా రుణాలు చెల్లించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోయల్‌ అన్నారు. మొదటి సంవత్సరం రుణాల రీ షెడ్యూల్‌ చేసుకున్న రైతులకు ప్రస్తుతం 2 శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ఇక నుంచి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి, ఎన్డీఆర్‌ఎఫ్‌ ధ్రువీకరించిన రైతులకు రుణంలో 2శాతం రాయితీతో పాటు, 3శాతం వడ్డీ రాయితీని కూడా ఇవ్వనున్నారు.

పంట సాగుకు విత్తనాలు, ఎరువులు కొనాలన్నా రైతు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రకటించింది. రెండు అంతకన్నా తక్కువ హెక్టార్ల (5 ఎకరాలు) భూమిని సాగుచేసుకుని జీవిస్తున్న రైతు కుటుంబాలకు ఆర్థిక అండ అందించేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. దీని ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొత్తం మూడు సమాన వాయిదాల్లో రూ.2 వేలు చొప్పున ఈ మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాల్లో వేస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తొలి విడతలో భాగంగా 1 డిసెంబరు 2018 నుంచి 31 మార్చి 2019 మధ్యకాలానికి రూ.2 వేలు రైతుల ఖాతాలో జమ కానుంది. ఈ పథకం అమలుకై ఏడాదికి రూ.75వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. దేశంలో గో సంపదను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. “గోకుల్‌ మిషన్‌” పేరుతో అమల్లోకి రానున్న ఈ ప్రత్యేక పథకానికి రూ.750 కోట్లు కేటాయించారు. గో ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా రాష్ట్రీయ కామధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా నాణ్యమైన ఉత్తమజాతి ఆవుల ఉత్పత్తికి కృషి చేయనున్నారు. ఆవుల సంక్షేమాన్ని కూడా రాష్ట్రీయ కామధేన్‌ ఆయోగ్‌ పర్యవేక్షించనుంది.