విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం: పవన్ కల్యాణ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విషయంలో బోర్డు అవకతవకలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు రోజులుగా తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు ముందు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంటర్ బోర్డు తీరుపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్‌ పరీక్ష పత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోయారని, పునఃమూల్యాంకనంకు ఆదేశించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించేలా ఆదేశించాలని బాలల హక్కుల సంఘం తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంటర్ బోర్డు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేయాలన్న చిత్తశుద్ధి లేదు…చేయలేమన్న భ్రమలో ఉన్నారు…అవసరమైతే మరింత మంది సిబ్బందిని వినియోగించండి… సునామీ వస్తే దీన్ని అడ్డుకోలేమని…ఇది తమ బాధ్యత కాదని తప్పుకుంటారా? బాధ్యత తీసుకోరా? ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. వారు మన పిల్లలు…సమస్య ఉందంటున్నారు… పరిష్కరిస్తామని భరోసా ఇవ్వండి అంటూ హైకోర్టు చివాట్లు పెట్టింది.

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో..పవన్‌ స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చడం దారుణమని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు, మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకూ చాలా సందేహాలున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలి. ఉచితంగా రీవాల్యుయేషన్‌, రీ వెరిఫికేషన్‌ చేయాలి. జీవితం విలువైనది.. ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడొద్దు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. బోర్డు అధికారులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలి అని పవన్‌ డిమాండ్‌ చేశారు.