కేసీఆర్‌ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది: బాబు

తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌ తనను బెదిరిస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మలక్‌పేటలో టీడీపీ అభ్యర్థి ముజఫర్‌ అలీకి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే తనకు అమితమైన ఇష్టమని పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది.. కేసీఆర్‌ కుటుంబం కోసం కాదన్నారు.

తాను చేసిన అభివృద్ధితోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కి వచ్చి నివసిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నగరానికి కృష్ణా నీటిని తీసుకువచ్చి నీటి సమస్యను తీర్చానని చెప్పారు. కేసీఆర్‌ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డానని విమర్శలు చేస్తున్నారని.. దేనికి అడ్డుపడ్డానో తెలపాలని నిలదీశారు. తాను తెలంగాణలో ఆదాయాన్ని పెంచానని.. కేసీఆర్‌ దుబారా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.