వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న నివాసంలోనే కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. యాజమాన్యం షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని లేఖలో వివరించారు. పక్కనే ప్రజావేదిక ఉన్నందున తన అధికారిక కార్యకలాపాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉండవల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ఇంటి అద్దె చెల్లించేది.