HomeTelugu Big Stories'బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి': చంద్రబాబు

‘బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి’: చంద్రబాబు

7 23బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జయహో బీసీ సభకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జనాభాలో బీసీలు 50 శాతం ఉన్నారని, వారిని ఆదరించి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ‘ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాం. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖతో పాటు 25 శాతం బడ్జెట్‌ పెట్టాం. గతంలో ఎప్పుడైనా ఇంత మంది బీసీ మంత్రులు ఉన్నారా? అన్ని వ్యవస్థల్లో బీసీలకు ప్రాధాన్యమిచ్చాం. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. తెలుగుదేశం పార్టీని వెనుకబడిన వర్గాలు నమ్ముకున్నాయి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా బీసీల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ’ అని చంద్రబాబు అన్నారు.

‘కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. టీడీనీ బలపడుతుందని వెనుకబడిన వర్గాలను వైఎస్‌ అణగదొక్కారు. 31 కులాలను బీసీల్లోకి చేర్చి రిజర్వేషన్లు పెంచకుండా వైఎస్‌ అన్యాయం చేశారు. 11 బీసీ ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారు. బీసీ నాయకులను హత్య చేశారు. 2 వేల మంది నేత కార్మికులు, 1600 మంది గీత, 30 మంది సర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీసీ మంత్రులు జైలు పాలయ్యారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌. బీసీ రిజర్వేషన్ల రద్దుకు జగన్‌ వత్తాసు పలికారు. బీసీలను దెబ్బతీసేందుకు వైసీపీ, బీజేపీ కుట్రపన్నాయి’ అని విమర్శించారు.

‘విదేశీ విద్య కింద వెనుకబడిన వర్గాలకు రూ.15 లక్షలు ఇస్తాం. బీసీలకు 100 నుంచి 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ‌ఇస్తాం. నేతన్నలకు రూ.111కోట్లు రుణమాఫీ చేశాం. ఎంబీసీలను గుర్తించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. ఎంబీసీలకు కేటాయించిన రూ.100 కోట్లలో రూ.90 కోట్లు ఖర్చు పెట్టాం. విద్యార్థులకు రూ.2,900 కోట్లు ఉపకార వేతనాలు ఇచ్చాం. ఆదరణ పథకం కింద రూ.950 కోట్లతో 4లక్షల మందికి పనిముట్లు ఇచ్చాం. బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీకు తోడుగా నేనుంటా.. నాకు చేయూతనిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. సంఘటిత శక్తిగా తయారైతే బీసీలకు ఎదురే ఉండదు. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకే. టీడీపీ తరఫున ప్రతి గ్రామంలో జయహో బీసీ గర్జన ఉద్ధృతం చేయాలి. జయహో బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌, కొల్లు రవీంద్ర పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీసీ శ్రేణులతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu