సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసు

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఆమె తనను చీట్‌ చేశారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈవెంట్‌ ఆర్గనైజర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. పారితోషికం తీసుకుని కూడా ఆమె కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. ఈ మేరకు ఆర్గనైజర్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు.

‘ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వడానికి సోనాక్షి రూ.37 లక్షలు తీసుకున్నారు. కానీ ఆమె హాజరు కాలేదు. దాని వల్ల మా కంపెనీ చాలా నష్టపోయింది. సోనాక్షి ప్రయాణం, హోటల్‌ రూమ్‌ కోసం మొత్తం రూ.9 లక్షలు ఖర్చు చేశాం. షోలో ప్రదర్శన ఇచ్చేందుకు ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించా. మీరు రాకపోతే చాలా నష్టపోతానని చెప్పా. అయినా ఆమె రావడానికి ఒప్పుకోలేదు’ అని ఆర్గనైజర్‌ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న మొరాదాబాద్‌ డీఎస్పీ విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి సోనాక్షితోపాటు మరో ముగ్గురిపై కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.