చిరు సినిమా ఆలస్యానికి కారణం!

దాదాపు తొమ్మిదేళ్ల సుధీర్ఘ విరామం తరువాత ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో అదే ఊపులో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న సినిమాలో నటించబోతున్నాడు చిరు.  ఈ సినిమాకు ‘సై.. రా నరసింహారెడ్డి’ అనే టైటిల్ ను ఖరారు చేసి చిరు పుట్టినరోజు కానుకగా గ్రాండ్ గా సినిమాను లాంచ్ చేశారు. దీపావళి తరువాత సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు.

కానీ కథకు తగ్గట్లుగా సెట్స్ ను సిద్ధం చేయడానికి సమయం పడుతుందని ఆ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం సెట్స్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా షూటింగ్ డిలే అవ్వడానికి మరో కారణం రామ్ చరణ్ అని తెలుస్తోంది.

‘సైరా’ చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతడు తన ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో పడి ‘సైరా’ కోసం తన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అందుకే ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తయిన తరువాతే ‘సైరా’ సినిమాను మొదలుపెడతాడని తెలుస్తోంది!