సూపర్‌ స్టార్ ఆరోగ్యంపై వదంతులేనా?

ప్రముఖ నటుడు తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై శుక్రవారం సోషల్‌ మీడియాలో పలు వదంతులు ప్రచారం జరిగాయి. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిని రజనీకాంత్ అభిమానులు కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి
వదంతులను నమ్మొద్దని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం ఆయన సిటీలోనే ఉన్నారని తెలిపారు. ఆయన భార్య లతా రజనీకాంత్ ఆధ్వర్యంలో దయా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో కూడా శనివారం పాల్గొనబోతున్నారని వెల్లడించారు.

రజనీకాంత్‌ నటించిన 2.0 సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమౌతోంది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రజనీకాంత్ నటించిన మరో సినిమా పేట ఆడియోను వచ్చేనెల 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్
వెల్లడించింది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఆ తర్వాత రజనీ, మురుగదాస్‌ కాంబినేషన్‌లో మరో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.