HomeTelugu Big Storiesకలర్ ఫొటో టీజర్ విడుదలచేసిన విజయ్ దేవరకొండ

కలర్ ఫొటో టీజర్ విడుదలచేసిన విజయ్ దేవరకొండ

Color photo teaser

అమృత ప్రొడక్షన్స్ నుంచి ఇప్పటికే ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ‘నా లాంటి నల్లగా ఉన్నోడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనున్న ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు. ఒకడు బ్లాక్ అండ్ వైట్ అంటాడు.. ఒకడు గులాబ్‌జామ్ రసగుల్లా అంటాడు..’ అంటూ సుహాస్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. సునీల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. ‘‘మీరు బాగా ప్రేమించినోళ్లు చనిపోయారు. శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడికి ఒక పులొచ్చింది. మీరు ఏం చేస్తారండి.. ప్రేమ గొప్పదా, భయం గొప్పదా’’ అంటూ సునీల్ గంభీరంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాల భైరవ దీనికి సంగీతం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం థియేటర్‌లో రిలీజ్‌ అవుతుందనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ వేదికగా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఆహాలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu