భారత్‌లో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు

భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగు‍తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 5,632 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనాతో 99,135 మంది చికిత్సపొందుతున్నారు. గత మూడు రోజులుగా భారత్‌లో రోజుకు 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనా రికవరీ రేటు 48.07 శాతం ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. దేశంలో కరోనా మరణాల రేటు 2.82 శాతంగా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 72 వేలు దాటింది. గత 24 గంటల్లో 2287 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,465 మంది మృతిచెందారు. తమిళనాడులో 24,586 పాజిటివ్ కేసులు నమోదు కాగా 200 మంది మృతిచెందారు. ఢిల్లీలో 22,132 మంది కరోనా బాధితులు ఉండగా 556 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 17,632 మంది కరోనా బాధితుల్లో 1092 మంది మృతిచెందారు. రాజస్థాన్‌లో 9373, యూపీలో 8729 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.