నేతల నేర చరిత్ర ప్రజలకు తెలియాలి


నేటి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయనేది దేశ ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం. దాదాపు అన్ని పార్టీల నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల అఫిడవిట్లలో ఎంతో మంది నేతలు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఓటర్లకు కూడా మరోదారి లేక వీరిలోనే ఒకరిని ఎన్నుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ గా తీసుకుంది. నేర చరిత్ర ఉన్నవారిపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై దేశంలోని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారిక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా పేర్కొనాలని తెలిపింది. 72 గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి అందించాలని చెప్పింది.

ఎన్నికల్లో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనేది కేవలం ఆ వ్యక్తి గొప్ప లక్షణాల ఆధారంగానే జరగాలని, పలానా వ్యక్తి అయితేనే గెలుస్తాడనే ధోరణితో జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలియాలని, వారికి ఓటు వేయాలో, వద్దో ప్రజలే నిర్ణయించుకుంటారని సుప్రీంకోర్టు వెల్లడించింది. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కాకూడదని సూచించింది. తీవ్ర నేరారోపణలున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి, పార్టీల్లో కీలక బాధ్యతలను చేపట్టకుండా చూసేందుకు చట్టాలను మార్చాలంటూ 2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచనలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ బీజేపీ నేత, లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.

CLICK HERE!! For the aha Latest Updates