దీపావళి శుభాకాంక్షలు.. తలైవర్‌

‘కాలా’ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. ఈ నెలాఖరులో ‘2.ఓ’ తో అలరించనున్నారు. శంకర్‌ దర్శకత్వంలోని ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 29న విడుదల కానుంది. ఇదిలా ఉండగా దీపావళి సందర్భంగా రజనీకాంత్‌ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్దకు మంగళవారం ఉదయం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు అక్కడ సందడి చేశారు. కేరింతలు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో రజనీకాంత్‌ కూడా బయటకు వచ్చి అభియానులకు అభివాదం చేశారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఆనందపరిచారు. తలైవర్‌ను చూడటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. చివరగా ‘అన్ని వర్గాల ప్రజలకు, అభిమానులకు, ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు’ అని రజనీ పేర్కొన్నారు.