Tollywood Highest Tax Paying Hero:
నిన్న మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు.. పుష్ప సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ పుష్ప 2 తో బిజీగా ఉన్నారు.
ఇక అల్లు అర్జున్ క్రేజ్ తో పాటు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెరిగింది. ఎంతలా అంటే 2023 – 2024 ఆర్థిక సంవత్సరం లో.. భారతదేశం నుంచి అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన టాప్ 20 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ పేరు కూడా నమోదు అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. బన్నీ తో పాటు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఏ స్టార్ హీరో కూడా ఈ జాబితాలో లేరు.
టాప్ 20 అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన సెలబ్రిటీలలో టాలీవుడ్ నుంచి ఉన్న ఒకే ఒక్క పేరు అల్లు అర్జున్. బన్నీ ఈ సంవత్సరం ఏకంగా 14 కోట్లు ఆదాయపు పన్ను కింద చెల్లించారట. ఇక ఈ జాబితాలో మొదట ఉన్న పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. 92 కోట్లు ఆదాయపు పన్ను కింద చెల్లించారు ఎస్ఆర్కే. దళపతి విజయ్, సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్, విరాట్ కోహ్లీ వంటి సెలబ్రిటీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
టాప్ 20 లో అల్లు అర్జున్ 16వ స్థానంలో ఉన్నారు. ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటి అంటే.. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా అల్లు అర్జున్ లాగానే 14 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదాయపు పన్ను కూడా భారీగానే చెల్లిస్తున్నారు.