HomeTelugu Big Storiesనీ పట్ల సిగ్గుపడుతున్నా... జర్నలిస్టుపై రానా ఫైర్‌

నీ పట్ల సిగ్గుపడుతున్నా… జర్నలిస్టుపై రానా ఫైర్‌

10 7
టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి ముంబయికి చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థపై మండిపడ్డారు. తనపై రాసిన వార్తను ఖండించారు. ‘మీటూ’ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ క్వాన్ సహ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లాతో కలిసి రానా డిన్నర్‌ చేశారని, ప్రత్యేకంగా కలిశారని ఓ పత్రిక ప్రచురించింది. గతంలో అనిర్బన్‌ బ్లా వేధించారని పలువురు యువతులు, నటీమణులు ఆరోపించారు. దీంతో ఆయన ఏజెన్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తితో కలిసి రానా సమయం గడపడం పట్ల ట్విటర్‌లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రానా నిన్ను చూసి సిగ్గుపడుతున్నాం’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు.

‘రానాలాంటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డ అనిర్బన్‌ బ్లాను ప్రోత్సహిస్తున్నారా?’ అంటూ ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు రానా స్పందించారు. సదరు పత్రికను ట్యాగ్‌ చేస్తూ.. ‘నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నానని మీరు ఊహించుకోవడానికి ముందు నిజానిజాలు తెలుసుకోండి. మీ దగ్గర నా నెంబర్‌ ఉంటే ఫోన్‌ చేయండి. లేకపోతే నా పీఆర్‌ బృందాన్ని సంప్రదించడం ఇంకా సులభం’ అని పోస్ట్‌ చేశారు. దీంతో రానాపై రాసిన కథనంలో నిజం లేదని తేలింది. ఆ సమయంలో వికారాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నానని, బెంగళూరులో డిన్నర్‌ చేశానని రానా వివరణ ఇచ్చారు.

దీంతో ఆ తర్వాతి రోజు సదరు వార్తాపత్రిక మళ్లీ కథనం రాసింది. ‘కొన్ని రోజుల క్రితం ఓ రెస్టారెంట్‌లో రానా వ్యాపారవేత్త అనిర్బన్‌ బ్లాతో కలిసి డిన్నర్‌ చేశారని మేం రాశాం. అయితే రానాను అనిర్బన్‌ బ్లా ఆహ్వానించారు. కానీ వెళ్లాలి అనుకున్న రానా వెళ్లలేదు. మేం తప్పుగా రాశాం’ అని ప్రచురించింది. దీన్ని చూసిన రానాకు మరింత కోపం వచ్చింది. సోమవారం ఆ వార్త రాసిన జర్నలిస్టును ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మీ తప్పును కవర్‌ చేసుకోవడానికి.. మీ వార్తాపత్రికలోని ఓ మూల నేను డిన్నర్‌కి షెడ్యూల్‌ చేసుకుని, వెళ్లనట్లు రాశారు. నీ పట్ల సిగ్గుపడుతున్నా నమ్రతా జకారియా (జర్నలిస్టు). మీ పని మీరు సరిగ్గా చేయండి, నా పని నన్ను చేసుకోనివ్వండి. అది ఓ ప్రముఖ పత్రిక.. అందులో చెత్త రాయకండి’ అంటూ పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu