భాగమతి ఆలస్యానికి కారణం అదే!

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క ను హీరోయిన్ గా పెట్టి యువి క్రియేషన్స్ సంస్థ ‘భాగమతి’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా కాలం అయింది. అయితే ఇంతవరకు సినిమా రిలీజ్ కాలేదు. అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అని అంటున్నారే తప్ప ఫైనల్ డేట్ మాత్రం బయటకు రాలేదు. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.

ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పట్ల యువి క్రియేషన్స్ వారు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. క్వాలిటీ పరంగా కూడా సినిమా సరిగ్గా రాలేదని టాక్. ఇప్పుడు మళ్ళీ సినిమాకు రిపేర్లు తప్పనిసరి అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రనిర్మాతలు ‘మహానుభావుడు’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. అలానే ‘సాహో’ సినిమా కూడా సెట్స్ పై ఉంది. మరి ‘భాగమతి’ ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తారో.. చూడాలి!