నన్నుతప్పుగా అనుకోకండి, నాకు ఆతృతగా ఉంది: రష్మిక

“ఛలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. “గీత గోవిందం, దేవదాస్‌” చిత్రాలతో గతేడాది మంచి హిట్స్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన “డియర్‌ కామ్రేడ్‌” చిత్రంలో నటిస్తోంది. నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల తెరకెక్కించనున్న “భీష్మ” చిత్రంలోనూ నటించనుంది. మరోపక్క ఆమె “యజమాన”, “పొగరు” అనే కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

రష్మిక ఈ మధ్య వరుసగా తెలుగు సినిమాలనే ఎంచుకుంటున్నారని, కన్నడ చిత్రాలకు సంతకం చేయడం లేదని ఓ వెబ్‌సైట్‌ వార్త రాసిందట. నా సొంత చిత్ర పరిశ్రమ నాపై కోపంగా ఉండటం ఏంటి? ఎవరు కోపంగా ఉన్నారో చెప్పాలంటూ ఆ వెబ్‌సైట్‌ను ప్రశ్నిస్తోంది రష్మిక. “ఎవరు నన్ను ఇలా అన్నారు? ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.. కానీ తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. నాకు నేరుగా మెసేజ్‌ చేయండి. సాధారణంగా నేను ఇలాంటివి పట్టించుకోను. ఎందుకంటే నా చిత్ర పరిశ్రమ గురించి మీరు ఇలా రాయడం, వారు నాపై కోపంగా ఉన్నారని చెప్పడంలో అర్థం లేదు. నేను దీన్ని నమ్మను. నాకు ఆధారాలు కావాలి. ఇవ్వండి.. నాకు నేరుగా మెసేజ్‌ చేయండి” అంటూ కొంటెగా నవ్వుతున్న ఎమోజీని రష్మిక ట్వీట్‌ చేశారు.