HomeTelugu Newsకరోనా నుండి కోలుకున్న వృద్ధ దంపతులు

కరోనా నుండి కోలుకున్న వృద్ధ దంపతులు

2 29
దేశమంతా కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మహమ్మారి 93 ఏళ్ల వృద్ధుడు కేరళలో కోలుకున్నారు. అతనితో పాటు 88 ఏళ్ల వయసుగల ఆయన భార్య కూడా వైరస్‌ను జయించింది. ఈ విషయం స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. వారివురికి డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఇతర వయోభార సమస్యలున్నప్పటికీ వైరస్‌ నుంచి బయటపడ్డారని తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటున్న తరుణంలో ఈ వృద్ధ దంపతుల ఉదంతం ఊరట కలిగిస్తోంది.

ఈ వృద్ధ దంపతులు ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళలోని పథనంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందినవారు. ఇటీవల ఆయన కుమారుడు, భార్యాపిల్లలు ఇటలీ నుంచి తిరిగొచ్చారు. వారికి అప్పటికే వైరస్‌ సోకడంతో అదికాస్తా ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించింది. ఇలా ఈ వృద్ధ దంపతులు సహా మొత్తం ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు. దీంతో వెంటనే వారందరినీ కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వీరికి 40 మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందించింది. హృదయ సంబంధిత సమస్యలు ఉండడంతో తొలుత వృద్ధ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. కానీ, వైద్యులు ఇచ్చిన సలహాలు క్రమం తప్పకుండా పాటించడంతో వెంటనే ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నారన్నారు. వైరస్‌ కూడా నెగిటివ్‌గా వచ్చింది. మిగతా కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ నుంచి బయటపడ్డారు. త్వరలో వీరందరినీ ఇంటికి పంపుతామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వైరస్‌ వృద్ధులనే ఎక్కువగా బలిగొంటోందని గణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఘటన అందరిలో ఓ ఆశ కల్పిస్తోంది. వైరస్‌ సోకినప్పటికీ.. మానసిక స్థైర్యం కోల్పోకుండా చికిత్సకు సహకరిస్తూ వైద్యుల సలహాలు పాటిస్తే తగ్గిపోతుందన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. ఏమాత్రం లక్షణాలున్నా, వైరస్‌ సోకిన వారితో సంప్రదింపులు జరిపిన ఉదంతాలు ఉన్నా వెంటనే స్వచ్ఛందంగా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కేరళలో సోమవారం కొత్తగా 32 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ కరోనా బారినపడ్డవారి సంఖ్య 222కు చేరింది. వీరిలో ఒకరు మరణించగా.. 19 మంది కోలుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu