HomeTelugu Newsవివాహేతర సంబంధాలు నేరం కాదా..?

వివాహేతర సంబంధాలు నేరం కాదా..?

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్‌ 497 పురాతన చట్టమని రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళల సమానత్వానికి అడ్డుపడే ఏ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.

6 25

ఒకరు ఎవరితో శృంగారం చేయాలి.. ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని మరో వ్యక్తి నిర్ణయించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళ తనకు ఇష్టం ఉన్నవారితో గడిపితే నేరంగా భావించలేదని పేర్కొంది. వివాహం కాగానే భార్య తన ఆస్తిగా భర్త పరిగణించడం సరికాదని పేర్కొంది. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, కేసులను దృష్టిలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలపైనా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే చట్టాన్ని సమర్థిస్తూ కేంద్రం తన వాదనలు వినిపించింది. వివాహేతర సంబంధం నేరంగా పరిగణిస్తేనే వివాహ పవిత్రతకు రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వాదన. అయితే కేంద్రం వాదనతో కోర్టు అంగీకరించలేదు. ఇష్టపూర్వక శృంగారం నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. సెక్షన్‌ 497 పురాతన చట్టమని తెలిపింది. చాలా దేశాలు ఈ తరహా చట్టాలను తొలగించాయని కోర్టు వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!