‘చివరిగా నవ్వుకుని తాళికట్టు నాయనా’.. ‘f2’ ట్రైలర్‌

వికర్టీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ నటించిన మల్టీస్టారర్ ‘f2’. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటించారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11న అమెరికాలో సినిమా ప్రీమియర్‌ షోలు నిర్వహించనున్నారు.

ఇందులో వెంకీ, వరుణ్‌ తోడల్లుళ్ల పాత్రల్లో సందడి చేయబోతున్నారు. డిసెంబరు 12న విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఇప్పటి వరకు 80 లక్షలమందికిపైగా దీన్ని చూశారు. 1.86 వేల మంది లైక్‌ చేశారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అత్యంత వినోదాత్మకంగా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

ట్రైలర్‌ ఆరంభంలో.. ‘చివరిగా నవ్వుకుని తాళికట్టు నాయనా..’ అని పూజారి అనడంతో పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న వెంకటేష్‌ షాక్‌తో చూసే సీన్‌ ఆకట్టుకుంది. కోపంతో చిటపటలాడే భార్య తమన్నాకు భర్తగా వెంకీ చక్కగా నటించారు. ఆయన కామెడీ టైమింగ్‌ అదిరింది. వరుణ్‌ కూడా మెహరీన్‌ను ఇంప్రెస్‌ చేయడానికి కష్టపడుతూ కనిపించారు. ‘మజాక్‌ చేస్తున్నావా?’ అని వెంకీని వరుణ్‌ అడిగితే.. ‘నవ్వేమన్నా నా తోడల్లుడివా?, మజాక్‌ చేయడానికి’ అని వెంకీ అన్నారు. ‘కాలం కలిసి వస్తే అవుతానేమో..’ అని వరుణ్‌ సమాధానం ఇచ్చారు. సరదాగా సాగే సీన్స్‌, డైలాగ్స్‌తో ట్రైలర్‌ను చక్కగా రూపొందించారు.