వడగళ్ల వర్షంలోనూ బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన బన్నీ ఫ్యాన్స్‌ ! .. వీడియో వైరల్‌

అభిమానానికి హద్దుల్లేవనే విషయం మరోసారి నిరూపితమైంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోమవారం తన 36వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు చెప్పడానికి పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లారు. పుట్టినరోజు కానుకగా చాలా మంది మొక్కల్ని ఇచ్చారు. త్రివిక్రమ్‌, సుకుమార్‌, హరీష్‌ శంకర్‌, మారుతి, శ్రీరామ్‌ వేణు తదితరులు బన్నీని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బన్నీకి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఓ పక్క వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తున్నా.. అందరూ అలానే ఇంటి ఆవరణలో నిల్చున్నారు. అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు చెబతూ కేకలు పెట్టారు. వారిని పలకరించడానికి స్టైలిష్‌ స్టార్‌ వర్షంలోనే డాబాపైకి వచ్చారు. అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది హీరోకి, అభిమానులకు మధ్య ఉన్న బంధమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన అభిమానులు చూపిన ప్రేమకు ధన్యవాదాలు చెబుతూ ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేశారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ మూడు ప్రాజెక్టులకు సంతకం చేశారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన వివరాల్ని సోమవారం ప్రకటించారు.