HomeTelugu Big Storiesసమత దోషులకి ఉరిశిక్ష ఖరారు

సమత దోషులకి ఉరిశిక్ష ఖరారు

4 26
కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ వద్ద నవంబర్‌ 24న జరిగిన సమతపై అత్యాచారం, హత్య ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గురిని దోషులుగా ప్రకటించింది. ఏ1 షేక్‌బాబు, ఏ2 షేక్‌ షాబుద్దీన్‌, ఏ3 షేక్‌ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నవంబర్‌ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామం సమీపంలో సమతపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు.

ఈ హేయమైన ఘటనపై ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 14న ఛార్జిషీటు దాఖలుకాగా.. డిసెంబర్‌ 23 నుంచి 31వరకు సాక్షుల విచారణ కొనసాగింది. జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ వాదనలు ప్రత్యేక కోర్టులో కొనసాగాయి.

తీర్పు వెలువరించే ముందు ఏమైనా చెప్పుకునేది ఉందా అని దోషులను న్యాయమూర్తి ప్రశ్నించారు. వారిపై మోపిన నేరం రుజువైందని తెలిపారు. దోషి షేక్‌బాబు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టాడు. తనకు వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా తమను క్షమించాలని విన్నవించుకున్నారు. అనంతరం వారికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తీర్పు వెలువరిస్తూ ఈ ముగ్గురు దోషులు చేసిన నేరం చాలా ఘోరమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు న్యాయమూర్తి రూ.26 వేల జరిమానా విధించారు. మొదటి దోషికి రూ.8 వేలు, మిగిలిన ఇద్దరు దోషులకు చెరో రూ.9 వేల చొప్పున జరిమానా విధించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!