గల్లంతైన గుత్తా జ్వాల ఓటు!

ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా జ్వాలా అసహనాన్ని వ్యాక్తం చేశారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు.

మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి గంటల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు