పెళ్లిరోజు సందర్భంగా అమల స్పెషల్‌ పోస్ట్‌

స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున, అమల మంగళవారం తమ 27వ పెళ్లి రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అమల తన ప్రియమైన భర్త నాగ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చాలా ఏళ్ల క్రితం దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. ‘వార్షికోత్సవ శుభాకాంక్షలు లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌. మీరు (అభిమానులు) మాపై శుభాకాంక్షల వెల్లువ కురిపించడం చాలా సంతోషంగా ఉంది. నాగ్‌, నా తరఫున అందరికీ ధన్యవాదాలు’ అని అమల ట్వీట్‌ చేశారు.

ఇదే సందర్భంగా నాగ్‌ స్నేహితుడు రామ్‌ ప్రసాద్‌ ‘శివ’ సినిమాలోని ‘సరసాలు చాలు..’ పాట వీడియోను షేర్‌ చేశారు. నాగ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని నాగ్‌ రీ ట్వీట్‌ చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు. మాపై ప్రేమ కురిపించిన వారందరికీ తిరిగి నా ప్రేమను పంపుతున్నా’ అని కింగ్‌ పోస్ట్‌ చేశారు. నాగ్‌ ప్రస్తుతం ‘మన్మథుడు 2’ లో నటిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.