షారుక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

బాలీవుడ్‌ ‘కింగ్‌ ఖాన్’ షారుక్‌ ఖాన్‌ ఈరోజు తన 53వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. షారుక్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ముంబయిలోని మన్నత్‌ (షారుక్‌ నివాసం పేరు)లో వేడుకలు మొదలయ్యాయి. ఆయన ఇల్లంతా విద్యుత్‌ కాంతులతో నిండిపోయింది. ఈరోజు ఉదయం ఇంట్లో తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. తన భార్య గౌరీకి కేక్‌ తినిపిస్తూ తీసిన ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. అనంతరం ఆయన నివాసం ఎదుట ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే షారుక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో టాప్‌ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది. అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి షారుక్‌కు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

‘హ్యాపీ బర్త్‌డే షారుక్‌. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండు. పశ్చిమ్‌బంగా రాష్ట్రానికి నువ్వు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీ సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే అలరిస్తూ ఉండు. త్వరలో జరగబోయే కోల్‌కత్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమంలో కలుద్దాం’- మమతా బెనర్జీ, పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి.

‘మీ సినిమాలతో మాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చారు. కింగ్‌ ఆఫ్ హార్ట్స్‌ షారుక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’- ఊర్వశి రౌతెల, బాలీవుడ్‌ నటి.

‘వన్‌ అండ్‌ ఓన్లీ కింగ్‌ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’- ఈషా రెబ్బా.

‘షారుక్‌ ఖాన్‌ పోలికలు లేకపోతే రాజ్‌, రాహుల్‌(షారుక్‌ నటించిన సినిమాల్లోని ఆయన పాత్రల పేర్లు) ఇంత అందంగా ఉండేవారు కాదు. హ్యాపీ బర్త్‌డే షారుక్’- సచిన్‌ టెండుల్కర్‌.

‘తన చిత్రాలతో నన్ను, ఈ ప్రపంచాన్ని మెస్మరైజ్‌ చేసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’- హర్భజన్‌ సింగ్.

‘హ్యాపీ బర్త్‌డే షారుక్‌. ఇలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం’- ఫరా ఖాన్‌, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌.