కేసీఆర్‌ ఉన్నంత వరకు కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో తాము గెలిస్తే కేసీఆర్‌ను జైలులో పెడతామని కాంగ్రెస్‌ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, కేసీఆర్‌ ఉన్నంత వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్‌.. మళ్లీ పైళ్లనుగెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే తిరిగి కేసీఆరే సీఎం కావాలని పేర్కొన్నారు.

నాడు మాధవరెడ్డి 100 పడకల ఆస్పత్రి కట్టిస్తే.. భువనగిరిని జిల్లా చేసిన కేసీఆర్‌ దాన్ని 350 పడకల ఆస్పత్రిగా మార్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. భువనగిరిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నాడు మాధవరెడ్డి హయాంలో, నేడు పైళ్ల శేఖర్‌ రెడ్డి హయాంలోనే అన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బాగా లబ్ధి పొందేది వలిగొండ మండలమేనని, 30వేల ఎకరాలకు నీరు వచ్చి ప్రతి చెరువు, కుంట నిండుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని, అలాంటి చంద్రబాబు కాంగ్రెస్‌కు ముద్దు అయ్యారని విమర్శించారు. తెలంగాణ కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావునోట్లోకి పోయేందుకు సిద్ధపడి.. కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను జైల్లో పెడతామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.