నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.. కేసీఆర్‌ ఆదేశాలను తూచ పాటిస్తా

తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. టీఆర్‌ఎస్‌లో తాను సైనికుడిలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తనని.. కేసీఆర్‌ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు పదుల సంఖ్యలో చెప్పానని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణలు దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారన్నారు. సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హరీశ్‌ చెప్పారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రచారం కొనసాగిస్తే దాన్ని పట్టించుకోవద్దన్నారు. పార్టీ కోసం కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ పనిచేయాలని టీఆర్‌ఎస్‌, నేతలు కార్యకర్తలకు ఆయన సూచించారు.