Homeతెలుగు Newsసైకిల్‌ని ఆంధ్రాకు పంపిస్తే మళ్లీ వచ్చింది: హరీశ్‌

సైకిల్‌ని ఆంధ్రాకు పంపిస్తే మళ్లీ వచ్చింది: హరీశ్‌

సైకిల్‌ పార్టీ ఆంధ్రా వాళ్లదని, దాన్ని అమరావతికి పంపిస్తే మళ్లీ వచ్చిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు మళ్లీ తెలంగాణకు రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ.. తెలంగాణ రాకుండా చివరి నిమిషం దాకా అడ్డుపడ్డారని.. అందుకే రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయిందని దుయ్యబట్టారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు.

10 12

తెలంగాణ కోసం టీడీపీ ఒక్క రోజైనా పోరాడిందా? అని హరీశ్‌ ప్రశ్నించారు. విభజనలో భాగంగా తెలంగాణకు రావాల్సిన సీలేరు ప్రాజెక్టును చంద్రబాబు గుంజుకున్నారని, రాష్ట్రంలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబుకు ఓటేస్తారా? అని ప్రజలను అడిగారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ సంక్షోభం వస్తుందన్నారు. ధరలు పెరిగాయని ఆలోచించిన కేసీఆర్‌.. ఈ సారి అన్ని రకాల పింఛన్లను పెంచనున్నారని తెలిపారు. గతంలో పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ప్రజలంతా హైదరాబాద్‌కు వెళ్తే పిట్టల్లా కాల్చి చంపారని గుర్తుచేశారు. ఉచిత కరెంటు సాధ్యం కాదని అవహేళన చేసిన చంద్రబాబుకు ఓటేయాలా? అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డ వివాహానికి రూ.లక్షా 116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.10వేలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఒకప్పుడు గర్భిణులు ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే రూ.30వేలు ఖర్చయ్యేవని, ఈ రోజు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచి కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నామని అన్నారు. గతంలో రైతులకు కాంగ్రెస్‌ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్‌ మాత్రం ఏడాదికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.8వేలు చొప్పున సాయం చేస్తున్నారని హరీశ్‌రావు వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu