అతని చూపులతోనే అత్యాచారం చేస్తున్నట్లుగా అనిపించింది: ఈషా గుప్తా

బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా.. ఓ రెస్టారెంట్‌ యజమాని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. శనివారం ఈషా తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారట. ఈ రెస్టారెంట్‌ను రోహిత్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈషా తన స్నేహితులతో కూర్చుని విందు చేస్తున్నప్పుడు ఆమె ఎదురుగానే కూర్చుని రోహిత్‌ వికృతంగా చూస్తున్నారట. ఈ విషయాన్ని ఈషా ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ అతని ఫొటోను బయటపెట్టారు.
‘నాలాంటి అమ్మాయికే ఈ దేశంలో భద్రత లేకపోతే మిగతా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీడంలేదు. నాతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ నన్ను రోహిత్‌ చూపులతో అత్యాచారం చేస్తున్నట్లుగా అనిపించింది. రోహిత్‌.. నువ్వు నీచగాడివి. నీలాంటి పురుషుల వల్లే దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. నన్ను గుచ్చి గుచ్చి చూస్తూ నా చుట్టూ తిరుగుతూ ఎంతో అసహ్యంగా ప్రవర్తించాడు. ఇలాంటివాళ్లు ఆడవారితో ఎలా ప్రవర్తించినా ఏమీ కాదు అనుకుంటారు. అతను నన్ను ముట్టుకోలేదు. ఏమీ అనలేదు. కానీ అతని చూపు చాలు ఓ ఆడది అసౌకర్యానికి గురవడానికి. నేనో సెలబ్రిటీనని అతను నన్ను అలా చూడలేదు’

నా అభిమాని కావడం వల్ల కూడా కాదు. కేవలం నేనో మహిళనని అలా ప్రవర్తించాడు. మహిళలకు భద్రత ఎక్కడుంది? మహిళలా పుట్టడమే శాపమా? నేను రెస్టారెంట్‌కి వచ్చానని తెలిసి రోహిత్‌ నా ముందున్న టేబుల్‌పైనే కూర్చుని చూడటం ఎంతవరకు సబబు చెప్పండి?’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్లపై మోహిత్‌ శర్మ అనే నెటిజన్‌ స్పందిస్తూ.. ‘సినిమా విడుదల అవుతోంది కదా.. అందుకే ఈ రచ్చంతా..’ అని కామెంట్‌ చేశాడు. ఇందుకు ఈషా ప్రతిస్పందిస్తూ.. ‘నువ్వో వెధవవి. ఆడపిల్లలు ఎక్కడా సురక్షితంగా ఉండకూడదా? లేకపోతే న్యాయవ్యవస్థ కంటే మీరు గొప్పవారని ఫీలవుతున్నారా?’ అని మండిపడ్డారు.