పండగ కంటే ప్రజలే ముందు..

దీపావళి పండగకు ముందు రోజే తిత్లీ తుఫాను బాధితులకు రూ.530కోట్ల సాయాన్నిఅందజేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు విత్తనాల సరఫరా చేయటంలో నిర్లక్ష్యం వహించిన బాపట్ల వ్యవసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. రబీలో వందశాతం కంటే అధికంగా సాగుచేసిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరవు బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని ఆదేశించారు. ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి.. యూనిట్ల మంజూరు శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా మందుల కొరత లేకుండా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆవిష్కరణలు నిరంతరం కొనసాగాలని..సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.