జనసేనకు మద్దతు.. తారక్‌ వస్తే ప్రాణమిస్తా: మంచు మనోజ్

ఏపీలో ఎన్నికల వేళ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై మోహన్ బాబు మండిపడుతూ ఆరోపణలు చేస్తున్నారు. తన విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదంటూ.. టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన తాజాగా భారీ నిరసన ర్యాలీ చేపట్టడం రాజకీయంగా సంచలనం రేపింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్‌బాబు కావాలనే ఇదంతా చేస్తున్నారంటూ అధికార టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి ప్రతిగా మంచు ఫ్యామిలీ సైతం.. టీడీపీ నేతలపై కౌంటర్ అటాక్ చేస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ట్విట్టర్ వేదికగా మంచు హీరోలు హాట్ కామెంట్లతో రాజకీయ సెగ పుట్టిస్తున్నారు. అయితే, ఇదంతా జగన్‌కు మేలు చేకూర్చేందుకు మోహన్‌బాబు కావాలని చేస్తున్నారనే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మంచు ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన మనోజ్.. ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను జనసేనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తారక్ రాజకీయ రంగంలోకి దిగితే మాత్రం.. అతని ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తానని చెప్పారు. ట్విట్టర్‌లో అభిమానుల మధ్య జరిగిన ఆసక్తిరమైన చర్చ సందర్భంగా మంచు మనోజ్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు.