తమిళ స్టార్‌ హీరో సినిమాలో జాన్వి.!

బాలీవుడ్‌ హిట్‌ ‘పింక్‌’ ను తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. హెచ్‌. వినోద్ (‘ఖాకి’ ఫేం) సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.‌ అమితాబ్‌ బచ్చన్‌ పాత్రను తమిళ స్టార్‌ అజిత్ పోషించనున్నారు. ఇందులో అజిత్‌ సతీమణిగా విద్యా బాలన్‌ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో జాన్వి కపూర్‌ దక్షిణాదికి పరిచయం కాబోతున్నారట. ఆమె అతిథి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కోసం స్క్రిప్టులో బోనీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలీవుడ్‌కు ‘దఢక్‌’ సినిమాతో నటిగా పరిచయమైన జాన్వి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె ప్రస్తుతం ‘తఖ్త్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క జాన్వి భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి.

‘పింక్‌’ రీమేక్‌లో తాప్సి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌, కీర్తి కుల్హరి పాత్రలో అభిరామి వెంకటాచలం నటించనున్నారు. ఆండ్రియా తరియంగ్‌ తన పాత్రలో తానే నటించబోతున్నారు. వీరితో పాటు ఆది కే రవి, అశ్విన్ రావు, అర్జున్‌ చిదంబరం సహాయ పాత్రల్లో నటించనున్నారు. ఈ నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందట.