ఏపీలో బోణీ కొట్టిన జనసేన


ఏపీలో జరిగిన ఉత్కంఠ పోరులో జనసేన బోణీ కొట్టింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటినుంచి రాష్ట్రంలో ఏకపక్షంగా వీస్తోన్న వైసీపీ ఫ్యాన్ గాలి హోరులో జనసేన ఒక్క స్థానం నిలబెట్టుకోగలిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఉత్కంఠ పోరులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 1167 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి రాజేశ్వరరావుకు 47,573 ఓట్లు రాగా.. రాపాకకు 48,740 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో గట్టిపోటీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు 44,690 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యమంటూ ఈ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన ప్రభావం రాష్ట్రంలో ఏమీ లేదని జాతీయ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పిన నేపథ్యంలో ఒక్కచోట సాధించిన ఈ విజయం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చినట్లయింది.