HomeTelugu Newsవైసీపీ పతనానికి ఇసుక సమస్యే నాంది: పవన్‌ కళ్యాణ్‌

వైసీపీ పతనానికి ఇసుక సమస్యే నాంది: పవన్‌ కళ్యాణ్‌

14 3జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. ఇసుక సమస్యపై విశాఖలో తాను లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తానన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే పోగొట్టిన ఉద్యోగాలు ఐదింతలని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీపై కక్షతోనే వైసీపీ ప్రభుత్వం కూలీల పొట్టకొట్టిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పతనానికి ఇసుక సమస్యే నాంది అవుతుందని పవన్‌ హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులకు పెద్దన్నయ్యలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

జనసేన పార్టీని చాలా ప్రతికూల పరిస్థితుల్లో పెట్టానని పవన్‌ అన్నారు. తానెప్పుడూ విజయాన్ని ప్రామాణికంగా చూడనని.. విలువలను మాత్రమే చూస్తానన్నారు. ఆశయాన్ని నమ్మి ఆఖరి క్షణం వరకు బతకగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే పార్టీ పెట్టానన్నారు. పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు.

ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఉండాలి తప్ప.. రూ.వేలకోట్లు సంపాదించుకోవడానికి కాదని పవన్‌ చెప్పారు. 2014లో పార్టీ పెట్టినపుడు అభిమానులు మాత్రమే ఉన్నారని.. పెద్ద నేతలెవరూ లేరని వివరించారు. తన సినిమా పరాజయం పాలైనపుడు కూడా వ్యక్తిగతంగా తనను ఇష్టపడే అభిమానులు ఆ సమయంలో వెన్నంటే ఉన్నారన్నారు.

సమాజంలో ప్రశ్నించేవారు లేకపోతే అరాచకం పెరిగిపోతుందన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై బలమైన కేసులు పెట్టారని.. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంపీడీవోను బెదిరిస్తే ఏమీ చేయలేకపోయారని పవన్‌ ఆరోపించారు. ఐదేళ్లలో సీఎం అయిపోదామని పార్టీ పెట్టలేదన్నారు. వ్యక్తులమీద కేంద్రీకృతమయ్యే రాజకీయాలు అవసరం లేదని.. పార్టీకి భావజాలం ముఖ్యమని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu