వసూళ్ల వర్షం కురిపిస్తున్న కబీర్‌సింగ్


షాహిద్‌ కపూర్‌ తాజా సినిమా ‘కబీర్‌ సింగ్‌’ (హిందీ అర్జున్‌ రెడ్డి) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. షాహిద్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన ఈ సినిమాపై అటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసల వర్షం కురుస్తోంది.. ఇటు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు రూ. 20.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు ఏకంగా
రూ. 22.71 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తానికి రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద రూ.42.92 కోట్లు సొంతం చేసుకుంది.

షాహిద్‌ కెరీర్‌లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘ఆర్‌..రాజ్‌కుమార్‌’. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మొత్తంగా రూ. 66.10 కోట్లు సాధించింది. ఆ రికార్డులను సైతం అధిగమించి తొలి వీకెండ్‌లోనే ‘కబీర్‌ సింగ్‌’ సినిమా రూ. 70 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు. షాహిద్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా ఈ
సినిమా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు షాహిద్‌ నటించిన ‘పద్మావతి’ చిత్రం భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ.. అది మల్టీస్టారర్‌ మూవీ కావడం..
ఆ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రణ్‌బీర్‌ సింగ్‌కు ఎక్కువ క్రెడిట్‌ దక్కింది. కబీర్‌ సింగ్‌ తెలుగులో సూపర్ సక్సెస్ సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు రీమేక్‌.