కల్కి ‘ఫస్ట్‌లుక్‌ అవతార్’

సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కల్కి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాజశేఖర్‌ భార్య పాత్రలో అదా శర్మ నటిస్తున్నారు. సి.కల్యాణ్‌, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ‘ఫస్ట్‌లుక్‌ అవతార్’ అంటూ చిత్ర బృందం వీడియోను విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు తెలిపింది. భారీ బడ్జెట్‌తో నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం రూ.2 కోట్లతో సెట్‌ను ఏర్పాటు చేశారట. 1983 నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్‌ వర్మ ‘అ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌ ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. రాజశేఖర్‌ ఇటీవల ‘గరుడవేగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలో పూజా కుమార్, శ్రద్ధాదాస్‌, సంజయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎమ్‌. కోటేశ్వరరాజు సినిమాను నిర్మించారు.