HomeTelugu Big Storiesకర్నాటకలో బోల్ట్‌ని మించిన పరుగుల వీరుడు

కర్నాటకలో బోల్ట్‌ని మించిన పరుగుల వీరుడు

8 14

జమైకా చిరుతపులి, స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ గురించి తెలియని వారుండరు. కేవలం 9.58 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అయితే బోల్ట్‌ను మించిన వేగంతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో స్టార్‌ అయ్యాడు కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ఔరా అనిపించాడు. బురద పొలంలో ఓ చేత్తో ఎద్దులను పట్టుకుని మెరుపువేగంతో దూసుకెళ్లాడు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో ప్రతిఏటా ‘కంబళ’ పేరుతో సంప్రదాయ ఎద్దుల పరుగు పందేలు అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. అలా ఓ గ్రామంలో నిర్వహించిన పోటీల్లో 28 ఏళ్ల శ్రీనివాస గౌడ అనే వ్యక్తి తన ఎద్దులతో కలిసి కేవలం 13.62 సెకన్లలోనే 142.50మీటర్లు పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తినట్లు. అంటే బోల్ట్‌ కంటే 0.03 సెకన్ల తక్కువ సమయంలోనే గౌడ 100 మీటర్లు పరిగెత్తాడన్నమాట.

రికార్డుల పరంగా వీరిద్దరినీ నేరుగా పోల్చడం సాధ్యం కానప్పటికీ శ్రీనివాస గౌడ వేగాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. అంతేగాక, 30 ఏళ్ల రికార్డును బద్దలుకొడుతూ ‘కంబళ’ చరిత్రలోనే ఇంత వేగంగా పరిగెత్తిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. శ్రీనివాస గౌడ గురించి స్థానిక మీడియాలో కథనాలు రావడం, సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యాడు.

శ్రీనివాస గౌడపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలంటూ పలువురు సూచిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు. ‘అతడి శరీర దారుఢ్యాన్ని ఒక్కసారి చూడండి. అథ్లెటిక్స్‌లో విజయాలు సాధించే అసాధారణ సామర్థ్యం అతడికి ఉంది. అందుకే అతడికి 100 మీటర్ల స్ప్రింట్‌లో శిక్షణ కల్పించేలా కిరణ్‌ రిజిజు చూడాలి. లేదా కంబళ క్రీడను ఒలింపిక్‌లో చేర్చేలా
ప్రయత్నాలు చేయాలి. దీంతో పాటు శ్రీనివాసకు బంగారు పతకం కూడా ఇవ్వాలి అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

మహీంద్రా ట్వీట్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. శ్రీనివాసను శాయ్‌కు పిలిపిస్తామని హామీ ఇచ్చారు. ‘అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్‌ ప్రమాణాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. శారీరక దృఢత్వం, ఓర్పు చాలా అవసరం. ట్రయల్స్‌ కోసం శ్రీనివాస గౌడను శాయ్‌ కోచ్‌ల వద్దకు పంపిస్తాం. దేశంలో ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోం’ అని రిజిజు ట్విటర్‌లో పేర్కొన్నారు. అటు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా శ్రీనివాస గౌడపై ప్రశంసలు కురిపించారు. ‘ఆ పనికి (పరుగెత్తడం) ఇంతకంటే మెరుగైన వ్యక్తి కన్పించడు. ఇలాంటి వ్యక్తులు మరింత మంది కావాలి. మీకు(కిరణ్‌ రిజిజును ఉద్దేశిస్తూ) మరిన్ని అధికారాలు ఉండాలి సర్‌’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu