‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను విడుదల చేసిన చిరంజీవి

ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఆ ఊళ్లో ఏ ఆడపిల్లైనా క్రికెట్‌ ఆడటం మీరు చూశారా?’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌.. ఐశ్వర్య రాజేశ్‌ తండ్రి పాత్రలో నటించారు. శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో నటించారు. ఝాన్సీ, నరసింహారావు, వెన్నెల కిశోర్‌, రవి ప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలిగింది. తప్పకుండా ‘కౌసల్య కృష్ణమూర్తి’ మంచి విజయం సాధిస్తుంది. సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక మహిళా క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ చక్కగా ఒదిగిపోయింది. ఈ పాత్రకోసం నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించిందంటే ఆ అమ్మాయికి ఉన్న నిబద్ధత, శ్రద్ధాసక్తులు అర్థమవుతున్నాయి. ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు. అలాగే కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను’ అని చిరంజీవి అన్నారు.