ఆస్పత్రి నుంచి శర్వానంద్‌ డిశ్చార్జ్

ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన షూటింగ్‌లో గాయాలపాలైన యంగ్‌ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్‌లో షూటింగ్ సమయంలో అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకొని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరారు. శర్వానంద్‌కు గత కొన్ని రోజులుగా డాక్టర్‌ గురవారెడ్డి ఆధ్వర్యంలో వైద్య చికిత్స అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. అత్యాధునికమైన చికిత్స అందించి శర్వానంద్‌కు గాయం త్వరగా మానేలా చేశామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. గాయం తీవ్రత తగ్గడంతో ఈ రోజు శర్వానంద్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.