గీతామాధురి కారణంగా కూతురి బర్త్‌డే కేక్‌ వద్దన్న కౌశల్‌!

బుల్లి తెర తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 సీజన్‌ ఎన్నో మలుపులు తిరుగుతూ 104వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈనాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సభ్యులు పోటీపడ్డారు. చివరి దశలో షోను మరింత హీటెక్కిస్తున్న కంటెస్టెంట్స్ నేడు ఫన్నీ టాస్క్‌లతో ఆకట్టుకున్నారు.

ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ స్మైలీ బాల్స్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ప్రకారం ట్రేలో ఉంచిన స్మైలీ బాల్స్‌ను నోటితో అందుకుని దండలా నిలబడి ఒకరి నోట్లో నుంచి మరొకరు నోట్లోకి కింద పడకుండా మార్చుకోవాలి. అలా ఎన్ని స్మైలీ బాల్స్‌ను అందుకుంటారో.. ఆ స్మైలీ బాల్‌‌‌పై రాసిన వస్తువుల్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్‌లో మొదట గీతా మాధురి స్మైలీ బాల్‌ను నోటితో అందుకుని దీప్తికి అందించగా.. దీప్తి సామ్రాట్‌కు.. సామ్రాట్ తనీష్‌కు.. తనీష్ రోల్ రైడాకు.. రోల్ రైడా కౌశల్‌కి ఇలా వరుసగా అందించారు.

కౌశల్ తన గారాల కూతురు లల్లీ బర్త్ డే సందర్భంగా తన కూతురిని హౌస్‌లోకి పంపాలంటూ కేక్ కట్ చేసిన తరువాత తిరిగిపంపించేస్తానని.. గత వారమే నానిని రిక్వెస్ట్ చేశాడు కౌశల్‌. దీనికి నాని స్పందిస్తూ.. బిగ్‌బాస్‌ తరపున నాని హామీ ఇవ్వకపోయినా ఏదొకటి చేస్తామన్నారు. అందుకే హౌస్‌లోకి కౌశల్ కూతురు లల్లీ బర్త్‌డే సందర్భంగా కేక్‌తో పాటు కౌశల్ కూతురు, కొడుకు ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్‌ను బిగ్ బాస్ పంపారు. ఈ కేక్‌ను స్టోర్ రూమ్‌లో చూసి ఎమోషన్ అయిన కౌశల్ ఆ కేక్‌ను తీసుకోవడానికి నిరాకరించారు. తన కూతురు బర్త్ డే గురించి హౌస్‌లో పెద్ద గొడవలు జరిగాయని.. అందుకే ఈ కేక్, గిఫ్ట్‌ను బయటకు వచ్చాక కలెక్ట్ చేసుకుంటా అని తిప్పిపంపించేశారు కౌశల్. తన కూతురికి తన దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. లవ్‌ యూ బంగారం, గాడ్‌ బ్లెస్ యూ అంటూ తన కూతురికి విషెస్ అందించాడు కౌశల్.

గత ఎపిసోడ్‌లో గీతా మాధురి.. కౌశల్‌ల మధ్య వాడి వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. మీ కూతురు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తే.. మీకు బూస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అందువల్ల మీ కూతురు రాకపోవచ్చని గీతా మాధురి అనడంతో ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది. అది తారాస్థాయికి చేరుకుని ఒకర్నొకరు దూషించుకునే వరకూ వెళ్లింది. ఇంత రచ్చ జరగడంతో తన కూతురు బర్త్ డే కేక్‌ను తీసుకోవడం ఇష్టం లేక కౌశల్ తిరిగిపంపించేశారు. ఆ కేక్ బిగ్ బాస్ పంపింది కాదని.. కౌశల్ కుటుంబ సభ్యులు పంపారని అందువల్ల తీసుకుని కట్ చేయాల్సిందిగా కౌశల్‌కు బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో కౌశల్.. వెనక్కి తగ్గి తన కూతురు లల్లీ బర్త్ డే కేక్‌ను బిగ్ బాస్ కుటుంబ సభ్యుల మధ్య కట్ చేసి.. లల్లీకి విషెష్ అందించారు. ఇక తనీష్, గీతా, దీప్తి, రోల్ రైడాలు లల్లీకి బర్త్ డే విషెస్ అందిస్తూ.. హ్యాపీగా కేక్‌ను ఎంజాయ్ చేశారు.