“లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌”లో కీరవాణి సోదరుడు

తెలుగు తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌” సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని దసరా సందర్భంగా శుక్రవారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించారు. దీపావళికి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక ప్రకటనను చేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. “లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌” సినిమాకు కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ “ఎన్టీఆర్‌”కు స్వరాలు సమకూరుస్తున్న ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడైన ఆయన అనుకోకుండా మా సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇది నిజంగా కాకతాళీయంగా జరిగింది.. ఉద్దేశ పూర్వకంగా ఆయన్ను ఈ ప్రాజెక్టుకు తీసుకోలేదు” అని వర్మ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు కల్యాణి మాలిక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.