ఖైదీ నం 150 vs ఆర్ జి వి

“అబ్బబ్బా అదేం సినిమారా నాయనా. అసలు కధే లేదు..” అంటూ వచ్చి కుర్చున్నాడు కనకాంబరం.
 
 
ఏకాంబరం : ఏంట్రా నువ్ సినిమాలో కధ కుడా చూస్తావా??
 
 
కనకాంబరం : కధ చూడకుండా లేటెస్ట్ కాస్ట్యూమ్స్ ఏం వాడారో చూడడానికి నేనేమైనా హీరోయిన్ అమ్మని అనుకున్నావా??
 
 
ఏకాంబరం : ఇంతకీ ఏ సినిమా గురించి అంత ఇదైపోతున్నావ్??
 
 
కనకాంబరం : “RGV వంగవీటి” అనెళ్ళాను, లోపలకెళ్ళాక వొంగోబెట్టి గుద్దేసినంత పనయింది.
 
 
ఏకాంబరం : ఏ.. అర్థం కాలేదా??
 
 
కనకాంబరం : పెద్దగా కధేం లేదురా.. పైగా కారెక్టర్లని సరిగా చూపించలేదని జనం అనుకుంటున్నారు.
 
 
ఏకాబరం : మీరు మారరురా.. షూటింగు మొదలెట్టినపుడు నుండీ చెప్తున్నాడు వర్మ – నిజ జీవితం ఆధారంగా తీస్తున్నాం అని నెత్తీ నోరు కొట్టుకుని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు ఏం జరిగిందో అదే తీస్తున్నాం అని. నీలానే అందరూ అందులో కధ లేదు అంటున్నారు. ఇంకా నయం “కామెడీ లేదు” అనలేదు.
 
 
కనకాంబరం : “పేరు గొప్ప ఊరు దిబ్బ” అని, ఓ… అంటూ పబ్లిసిటీ చేయడం.. తీరా సినిమా ఏమో ఇలా తుస్సుమనిపించడం వర్మకి బాగా అలవాటైపోయిందెహే.. అయినా ఆ ట్వీట్లేంటిరా?? అసలేమైనా అర్థం ఉంటుందా?? మనూర్లో రాత్రైతే నైన్టీ ఏసోవోడు ఇంకా బాగా మాట్లాడతాడు. ఆ ట్వీట్లుతోటే పబ్లిసిటీ మనోడికి.
 
 
ఏకాంబరం : ఓరి బాబూ.. ఆయన ట్వీట్లెట్టాక మీడియా వోళ్ళు వాటి మీద పడతారు. అంతే కానీ.. ఆల్రడీ మీడియాలో నలుగుతున్న వాటిపైన ఆయన ట్వీట్లు చేయడు.
 
 
కనకాంబరం : అయినా ఇప్పుడు చిరంజీవి పోస్టరు మీద ట్వీట్లు అవసరమా??
 
 
ఏకాంబరం : మనోడికి బాగా నచ్చిందేమో… అందుకే అలా చెప్పాడు. మీకే ప్రతి చిన్న దానిని పెద్దగా చూడడం అలవాటైపోయి తట్టుకోలేకపోతున్నారు.
 
 
కనకాంబరం : వంకరగా పెడితే ఎవరూ తట్టుకోలేరులే..
 
 
ఏకాంబరం : సూటిగా మాట్లాడే వాడు ఈ ప్రపంచానికి వంకరగానే కనపడతాడులే…
 
 
కనకాంబరం “జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందని” వంకరతనంలో నువ్వు సపోర్టు ఇస్తున్నావా??
 
 
ఏకాంబరం : అసలు నీ భాధ ఏంట్రా?? సినిమా బాలేదనా?? చిరంజీవి పోస్టరు గురించి మాట్లాడాడనా?? లేక అసలు వర్మంటేనే పడదా??
 
 
కనకాంబరం : అవన్నీ కాదురా.. అసలు ఇంటర్వ్యూలో ఎవరైనా అలా మాట్లాడుతారా?? పొద్దున్నే లేచి పది నిముషాలు పోర్న్ చూస్తా అని ఎవరైనా చెప్తారా??
 
 
ఏకాంబరం : “అత్త కొట్టినందుకు కాదు. తోటికోడలు నవ్వినందుకు ఏడిచిందని”.. ఎంత మంది చేయట్లేదు అలాగ?? మనం కప్పెట్టేసేం.. ఆయన బయటెట్టేసేడు అంతే..
 
 
కనకాంబరం : అయినా సరే.. అలాంటివి అలా చెప్పొచ్చా??
 
 
ఏకాంబరం : అలాంటి ప్రశ్న అడిగారు కాబట్టి అలా సమాధానం చెప్పాడు.. తప్పేముంది – “ఎంత చెట్టుకి అంత గాలి”
 
 
కనకాంబరం : అవును.. నీలాగే అడ్డ దిడ్డంగా మాట్లాడి.. ఏదేదో చెప్తూ ఉంటాడు.
 
 
ఏకాంబరం : ఒరే.. అడ్డదిడ్డంగా పెట్టాడు అనుకోకురా.. అసలేం తీసుకోకుండా జనాన్ని ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నాడు. అసలు మనకి “అయన్‌ ర్యాండ్” అనే రచయిత్రి ఉందని తెలుసా?? ఆవిడ “ఫౌంటైన్ హెడ్” అనే పుస్తకం రాసిందని తెలుసా?? అందులో “హోవార్డ్ రోక్” అనేవాడు వర్మ కన్నా తెలివిగా మాట్లాడతాడని తెలుసా?? ఇప్పటికీ అమెరికాలో కుర్రోళ్ళంతా ఆ పుస్తకం చదవడానికి వెర్రెక్కి పోతారని తెలుసా??
 
 
కనకాంబరం : ఏంటీ ఇయ్యన్నీ నీకు ఆ ట్వీట్లు చూస్తేనే తెలిసిపోయిందా??
 
 
ఏకాంబరం : చదివేసి వదిలేస్తే అవి ట్వీట్లులానే ఉంటాయి. అర్థం చేసుకుని ఫాలో అయితే గైడు‌లా ఉపయోగపడతాయి. అందులో వాడిన పదాలని, పేర్లని పట్టుకుని వెతికితే నీకు బోలెడంతా జ్ఞానం వద్దన్నా ఇస్తున్నాడు వర్మ.
 
 
కనకాంబరం : అయితే ఇపుడేం చేయమంటావ్???
 
 
ఏకాంబరం : ఏం చేయొద్దు. అలా ఊరుకో. వర్మ ఏదైనా చేస్తే చూసి ఊరుకో.. కనీసం పట్టించుకోకుండా ఉండడానికి ట్రై చెయ్. నీవల్ల కాదు. ప్రశాంతంగా ఉన్న చెరువు మధ్యలోకి రాళ్ళు విసిరినట్టు… సేఫ్టీ జోన్‌లో కన్వీనియంట్‌గా బతికేస్తున్న గా సమాజంలోకి ప్రశ్నలు విసురుతూ ఉంటాడు వర్మ. చూసి నేర్చుకోడమే.. జనాన్ని చూసి నవ్వుకోడమే!!!!
 
–V.K