ఆస్కార్‌ విన్నర్‌ లేడీ గాగా నెక్లెస్‌ ధర ఎంతంటే?

అమెరికన్‌ గాయని, నటి లేడీ గాగా పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసాధారణ పనితీరుతో, విభిన్నమైన హైయిర్‌ స్టైల్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సోమవారం లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 91వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో అందరి చూపును తనవైపునకు తిప్పుకున్నారు. అయితే ఈసారి దానికి కారణం ఆమె ధరించిన డైమండ్ హారమే. ఎందుకంటే దానిలోని వజ్రం విలువ అక్షరాల రూ.212,98,50,500(అంటే రూ.200 కోట్ల పైచిలుకు) మరి.

ఈ 128.54 క్యారట్ల వజ్రాల హారం టిఫనీ అండ్ కో. సంస్థకు చెందింది. గతంలో మూడు సార్లు మాత్రమే ఈ డైమండ్ పబ్లిక్‌లో దర్శనమిచ్చింది. లేడీగాగా కంటే ముందు ఆడ్రే హెప్‌బర్న్‌ అనే హీరోయిన్‌ 1961లో ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్‌’ అనే చిత్రంలో దాన్ని ధరించడానికి అనుమతి పొందారు. ఇప్పుడు ఆ అవకాశం గాగాకు దక్కింది. అయితే అప్పటి దాంతో పోల్చుకుంటే దీంట్లో కొద్ది మార్పులు చేశారు. కానీ ధరలో మాత్రం మార్పు రాలేదు. 1972లో ఈ డైమండ్‌ను విక్రయించడానికి న్యూయార్క్‌ టైమ్స్‌లో ఓ ప్రకటన ఇచ్చి, 24 గంటలు సమయం ఇచ్చినా దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇలా ఓ అవార్డు కార్యక్రమంలో దీన్ని ధరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘వినూత్నంగా ఆలోచించే, ఆసాధారణ వ్యక్తి లేడీగాగా. ఆ వజ్రాన్ని వెలికి తీసిన 141 సంవత్సరాల తరవాత ఓ అవార్డు కార్యక్రమంలో ఆమె దాన్ని ధరించనుండటం థ్రిల్‌గా ఉంది’ అని ఆ సంస్థ చీఫ్ ఆర్టిస్ట్ వెల్లడించారు. విలువైన నెక్‌లెస్‌తో రెడ్‌ కార్పెట్ మీద నడిచి ఆకట్టుకున్న లేడీగాగా..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుని మురిసిపోయింది. ‘స్టార్ ఈజ్‌ బోర్న్’ సినిమాకు లేడీగాగాకు ఉత్తమ నటి కేటగిరీలో కూడా నామినేషన్‌ దక్కింది. అయితే దాంట్లో నిరాశ ఎదురైనా..ఆ సినిమాకే సింగర్‌గా అవార్డు సొంతం చేసుకుంది.